ఆ వృద్ధురాలిది పాతబస్తీ. ఆమెకు కోట్లకు పడగలెత్తిన కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. అయినా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆమె గాంధీ ఆస్పత్రి వద్ద ఏడుస్తూ కనిపించింది. శీనన్న ఆమె కథ తెలుసుకున్నాడు. ఆశ్రమంలో చేర్పించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమె చనిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటన ఇది.
అనాథలు ఆకలి తీరుస్తున్నాడు. వాళ్ల కథ తెలుసుకొని కదిలిపోతున్నాడు. ఆశ్రమాల్లో చేర్పిస్తున్నాడు. ఎక్కడైనా ఎవరై నా చనిపోయారని తెలిస్తే క్షణాల్లో అక్కడ వాలిపోతున్నాడు. మృతదేహాలను తన చేతులతో మార్చురీకి తరలిస్తున్నాడు. మార్చురీలో పడి ఉన్న శవాలకు సొంత ఖర్చులతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నాడు. అందరికీ ఆత్మబంధువు అ య్యాడు. పోలీసులకు దగ్గరివాడయ్యాడు. అందరితో అన్న అనిపించుకుంటున్నాడు. ఆయన రియల్ వివేక్ ట్రస్ట్ అధ్య క్షుడు శ్రీనివాస్ గుప్త. అయితే ఆయనను అందరూ ప్రేమగా పిలుచుకునే పేరు శీనన్న చిన్నతనంలోనే సేవాబాట పట్టిన ఆయన ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. జంట నగరాల ప్రజలకు ఆపద్బాంధవుడిగా మారారు.
పిలిస్తే వస్తాడు.. ఫోన్ వస్తే చాలు వాలిపోతాడు..
సికింద్రాబాద్ బోయగూడకు చెందిన మొగిలిపల్లి శ్రీనివాస్ గుప్త అలియాస్ శీనన్న సొంతూరు జనగాం. ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో చదువుతో పాటు సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉదయం స్కూలుకు వెళ్లే వాడు. సాయంత్రం సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడు. నగరానికి వచ్చిన తర్వాత దానిని కొనసాగిస్తున్నాడు. జంట నగరాల ప్రజలకు ఆపద్బాంధవుడిగా మారాడు. పోలీసులకు స్నేహితుడయ్యాడు. రోడ్లపై ఆనాథ కనిపిస్తే ఆకలి తీరు స్తాడు. పదేళ్ల క్రితం చిన్నచిన్న పనులు చేస్తూ జీవించేవాడు. తెల్లవారుజామున మిల్క్ బూత్ లో పని చేసేవాడు. పొద్దంతా అనాథలకు సేవ చేసేవాడు. సాయంత్రం వైన్ షాపులో పని చేసేవాడు. వచ్చిన సంపాదనలో ఎక్కువ భాగం ఆనాథల సేవకే వెచ్చించేవాడు. ఏడేళ్ల క్రితం అతని ఐదేళ్ల కొడుకు వివేక్ గుండె సంబంధిత వ్యాధితో మరణించాడు. కుమా రుడికి గుర్తుగా రియల్ వివేక్ ట్రస్ట్ నెలకొల్పాడు. పూర్తి స్థాయిలో సేవకే అంకితమయ్యాడు. ఆకలితో ఎవరైనా కని పిస్తే అన్నం పెట్టేస్తాడు. రోడ్లపైన ఏదైనా శవం కనిపిస్తే పోలీసులకు సమాచారం అందిస్తాడు. వెంటనే మార్చురీకి తరలిస్తాడు. నగరంలోని ప్రతి పోలీస్ అధికారి వద్ద అతని ఫోన్ నంబర్ ఉంటుంది. నగరంలో ఏ మూలన ఎక్కడ కుల్లిపోయిన స్థితిలో శవం కనిపించినా, ఎవరైనా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పోలీసుల సమాచా రంతో అక్కడికి చేరుకుంటాడు. సొంతవాళ్లే తాకడానికి భయ పడే స్థితిలో ఉన్న మృతదేహాలను ప్రేమతో జాగ్రత్తగా మార్చు రీకి తరలిస్తాడు. శీనన్న 27 ఏళ్లుగా చేస్తున్న ఇలాంటి సేవల తో అందరివాడయ్యాడు. ఆయన సేవలను పోలీస్ ఉన్నతా ధికారులు గుర్తించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు.
అనాథ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు
నగరంలో ఏ మూలన ఆనాధ చనిపో యిందని తెలిసినా శీనన్న వెంటనే అక్కడ వాలిపోతాడు. సొంత ఖర్చులతో మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాడు. తన సొంత ఖర్చులతో ఇప్పటి వరకు ఆయన 4000 వేల అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించాడు. వీరిలో 3500 మంది హెచ్ఐవీ, కేసర్ తో చనిపోయిన వాళ్లే. గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో కనిపించే అనాధ రోగులతో అప్యాయంగా మాట్లాడతాడు. నగరంలోని ఆనాథ ఆశ్రమాల్లో చేర్పిస్తాడు.
ట్రస్ట్ కు అంబులెన్స్
జంటనగరాల ప్రజలకు శీనన్న చేస్తున్న సేవలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ కూడా గుర్తించారు. కుల్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను మార్చురీకి తరలిస్తున్న శీనన్న సేవలను చూసి స్పందించారు. మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు వీలుగా వివేక్ ట్రస్టు ప్రభుత్వం తరఫున ఉచిత అంబులెన్స్ అందజేశారు.
- జాకీర్ హుస్సేన్
పూర్తిగా అనాథల సేవకే అంకితమయ్యా
నగరంలో ఎక్కడ పడితే అక్కడ అనాథలున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపై బుక్కెడు బువ్వ కోసం అల్లాడుతున్న వృద్ధులు, అనాథల కళ్లలో ఆనందం నింపాలని అనుకున్నా, ఎక్కడ ఎవరు చనిపోయారని ఫోన్ వచ్చినా క్షణాల్లో అక్కడికి వెళ్లి పోతా. రోడ్లపైనే చనిపోయిన వాళ్లను ఎంతో మందిని నా చేతులతో మార్చరీకి తరలించాను. రోడుపై ఎవరైనా చనిపోతే ఎవరూ ముట్టుకోరు. కనీసం ఏమైందనీ అడగరు. నాకేం వస్తుందని అనుకుంటే ఓ రోజు వాళ్లకీ ఆ పరిస్థితి రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. నా కొడుకు చనిపోయిన తర్వాత పూర్తిగా ఆనాథల సేవకే అంకితం అయ్యాను. ఎవరైనా అనాథలు ఇబ్బందుల్లో ఉంటే ఒక్క కాల్ చేయండి వాలిపోతా..
- శ్రీనివాస్ గుప్త (శీనన్న)